ఢిల్లీ: ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఇసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా 4 రకాల కారణాలతో ఓటర్ల తొలగింపు ఉంటుందని, ప్రతి ఓటరుకు ఇన్యుమరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ 12 ఏళ్ల క్రితం జరిగిందని, బీహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తొలిదశలో బిహార్ లో జరిగిన ఎస్ఐఆర్ లో 7.5 కోట్ల మంది పాల్గొన్నారని, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి కొందరు సహాయకులుగా ఉంటారని అన్నారు. అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడం ఎస్ఐఆర్ లక్ష్యమని, ఎస్ఐఆర్ బూత్ లెవెల్ అధికారులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లోని ఓటరు వద్దకు బూత్ లెవెల్ అధికారి మూడుసార్లు వెళ్తారని జ్ఞానేష్ కుమార్ తెలియజేశారు. మరణించినా, వలస వెళ్లినా, ఎక్కువచోట్ల నమోదు చేయించుకున్నా తొలిగిస్తామని, ఎఆర్ఒ వద్ద లభించే ఎన్యుమరేషన్ పత్రాలను వివరాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారని.. అనర్హులైలను తొలగిస్తామని, 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒక్కో అధికారి రోజుకు 50 ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలిస్తామని, ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలించాక ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రకటిస్తామని అన్నారు. ఓట్లు తొలగించిన వారి పేర్లను కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని, వృద్ధులు, దివ్యాంగులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సిఇసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.