ఆనందాల ముల్లె
అందాల పల్లె
తీగ చుట్టిన మల్లె
మట్టిగోడలు గట్టి మనసులు
మట్టిమనుషుల దండి గుండెలు
జాజు పూసిన అర్రలు
ప్రేమ చూపే కన్నులు
సూరు కిందికెళ్ళి
లొద్ది ఎదురుకోలు
కాకి వరుసలు అయినా
కాకి బలగం మోహరింపు
పెద్ద పెద్ద ఎనగర్రలు
వాళ్ల హృదయమంత విశాలం
ఎదురు నిలిచిన మొగురం
వాళ్ల మది వినీలం
సాలెంకడాలు కాళ్ళ కడాలు
గంటీలు పట్టగొలుసులు
ముక్కుపోగు పెట్టుకున్న దేవత
ముచ్చట పెట్టినట్టు అవ్వ ముచ్చట
పావురాల మాటలు
పక్షుల కూతలు
పల్లె అలికిడి పెద్దవాకిలి
చేదుకున్నంత చెలిమి
పట్టుకున్నంత కలిమి
పల్లె తేనెపట్టు
పట్టుకొమ్మ
చెట్ల తీర్థం
తియ్యని చక్కెర తీర్థం!!
– బొల్లం బాలకృష్ణ