మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: చెంచు గిరిజన ఆదివాసి జంటలను ఒకే వేదికపై 111 మందికి వివాహాలు జరగడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం 111 చెంచు గిరిజన యువతీయువకులకు సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ సామూహిక వివాహాలు చేసుకున్న దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆయనతోపాటు హైకోర్టు జడ్జి మాధవిదేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కళ్యాణ ఆశ్రమం అఖిలభారత కార్యకారిణి, ఇండోర్ కు చెందిన రేఖ నాగర్, ప్రాంత అధ్యక్షుడు కాట్రాజు వెంకటయ్య తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటికి చేర్చి సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఒకే వేదికపై వివాహాలు జరిపించడం పట్ల తెలంగాణ వనవాసి కళ్యాణ పరిషత్ బాధ్యులను అభినందించారు. సమాజంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సామాజిక రుగ్మతలను దూరం చేసే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండదండలు ఉంటాయని అన్నారు. అడవి బిడ్డల వివాహానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రాంత చెంచు గిరిజనులను మరొకసారి కలుసుకుంటానని అన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు దేవుడి అండ దండలు ఎల్లప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చెంచు గిరిజనుల సామాజిక వివాహ మహోత్సవానికి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ హాజరై ఆశీర్వదించడం అభినందనీయమని అన్నారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. హైకోర్టు జడ్జ్జి టి. మాధవిదేవి మాట్లాడుతూ.. సామూహిక వివాహాల్లో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను ఇదే నల్లమల కోడలినని, పదర మండలం, ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన తంగిరాల హనుమంత రెడ్డి కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. నిరుపేదలైన చెంచు గిరిజనులకు తన అండదండలు ఎప్పటికీ ఉంటాయని ఏ ఆపద వచ్చిన తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకుముందు నారాయణపేట జిల్లా అంబత్రేయ క్షేత్రానికి చెందిన ఆదిత్య పరాశర స్వామి ఆశీర్వచన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగయ్య, తెలంగాణ ఆదివాసీ మహిళా ప్రముఖ గుర్రం శంఖులత, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు ఏమి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్ రాజు, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, అచ్చంపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వాగతం పలికారు.