మన తెలంగాణ/హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతోందని. గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదిలిందని, ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ -తూర్పున 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణశాఖ వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం ఈ తీవ్ర వాయుగుండం మరో 10 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాను నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతాల మీదుగా కదిలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావర కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్, అరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కండి
మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సిఎం చెప్పారు. ఎస్‌ఎంఎస్ అలర్ట్, సోషల్ మీడియా, ఐవీఆర్‌ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి తుఫాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు.