మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని బిజెపి ఎంపిలు రాజీనామా చేస్తే బిసి రిజర్వేషన్ల బిల్లు నడుచుకుంటూ వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. నగర శివారులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ల పెండింగ్ బిల్లు కోసం స్థానిక ఎంపి ధర్మపురి అరవింద్ తొలుత రాజీనామా చేసి, మిగిలిన తమ పార్టీ ఎంపిలకు ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేశారు. గతంలో మాధవ్‌నగర్ బ్రిడ్జి ఎందుకు పూర్తి కావడం లేదని ఎక్కువగా మాట్లాడే వారని అన్నారు. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం పోయి రెండేళ్లు అయ్యింది. మళ్లీ అరవింద్ ఎంపిగా గెలిచిన ఈ బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు.
‘ఈ బ్రిడ్జి పనులు నిర్మాణం కోసం మీరు ధర్నా చేస్తారో, లేదా సిఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు కూర్చుంటారో లేదా ప్రధాని మోడీ ఇంటి ముందు కూర్చుంటారో కానీ వెంటనే పూర్తి చేయాలి’ అని డిమాండ్ చేశారు. శనివారం ప్రారంభించిన జాగృతి ‘జనం బాట’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శనివారం రెండోరోజు నవీపేట మండలం, యంచ గ్రామానికి వెళ్లి పరిశీలించగా ముంపు బాధిత రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని అయిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డి బాధ్యత తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల మక్క రైతులు ప్రైవేట్ వ్యాపారుల వల్ల నిలువు దోపిడీకి గురయ్యారని తెలిపారు. సుమారు 80 శాతం మంది దళారులకు అమ్ముతున్నారని స్పష్టం చేశారు. మక్కకు కూడా కనీస మద్దతు ఇస్తామని చెప్పినా ఇవ్వడం లేదన్నారు. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల క్వింటాలుకు రూ.700 నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్ద అవుతోందని, ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు ఎలాంటి తరుగు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. మొన్న యాసంగిలో కూడా రైతులకు బోనస్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికీ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బిజెపికి చెందిన ఒక ఎంపి తనపై, తన కుటుంబంపై విమర్శలు చేశారని, అన్ని ఆధారాలతో వారి చిట్టా విప్పి మీడియా ముందు పెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్లర్లకు ప్రతినెల డబ్బులు ఇస్తున్నారని, కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు పాల్గొన్నారు.