హైదరాబాద్: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో గల పేరపళ్ల పెద్దగుట్ట శివారులో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రైతులకు చిరుత కళేబరం కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కమాలుద్దీన్, సంతోష్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పులి కళేబరాన్ని పరిశీలించారు. దుర్వాసన రావడంతో మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కళేబరం ఎక్కడా గాయాలు లేకపోవడంతో అనారోగ్యంతో చనిపోయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.