హైదరాబాద్: బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాపు, మున్నూరు కాపు వేరు వేరు కాదని, నవీన్ యాదవ్ గెలుపు కోసం కాపులంతా ఐక్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు వర్గానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాపు సోదరులకు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను, వి హనుమంతరావు కూడా రాజకీయాలలో ముందంజలో ఉన్నామన్నారు. కష్టపడితేనే రాజకీయాలలో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి మున్నూరు కాపు సోదరులు భారీగా హాజరయ్యారు.