విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ కివీస్‌ని ముప్పు తిప్పలు పెట్టింది. ఫలితంగా ఇప్పటికే సెమీస్‌కి చేరుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన న్యూజిలాండ్.. టోర్నమెంట్‌ని ఓటమితో ముగించింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్‌కు ఇది చివరి వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు డివైన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కివీస్ బ్యాటింగ్‌లో జార్జియా ప్లిమ్మర్ (43) టాస్ స్కోర్‌గా నిలువగా.. అమేలియా కెర్(35), సోఫి డివైన్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఆ తర్వాత లక్ష్య చేధనలో ఇంగ్లండ్ అదరగొట్టింది. ముఖ్యంగా ఓపెనర్ ఏమీ జోన్స్ (86*) సత్తా చాటింది. ట్యామీ బేమౌంట్ 40, హీథర్ నైట్ 33 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇక ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్‌లు సెమీ ఫైనల్‌కు చేరాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి.