జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది
రాబందు ప్రభుత్వం పోవాలి.. కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందని ఎద్దేవా చేశారు. మంత్రి ఒఎస్‌డి తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని, మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారని చెప్పారు. తుపాకీ రోహిన్ రెడ్డి పెట్టిండా..సుమంత్ పెట్టిండా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పలువురు హోటల్స్ కార్మిక నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హోటల్‌లో పనిచేసే కార్మికులు బ్రతుకుదెరువు కోసంహైదరాబాద్‌కు వచ్చారని, బిఆర్‌ఎస్ హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని అన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్టు కోసం సిఎం అల్లుడు,మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐ.ఏ.ఎ.స్ రాజీనామా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని, ఓఆర్‌ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని చెప్పారు.
రెండేళ్లలో రాష్ట్రాన్ని,హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడిందని విమర్శించారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే నిబంధనలు ఉంటాయని, పెద్దలకు రూల్స్ ఉండవు అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చురుకు పెట్టాలని, తెలంగాణకు లాభం చేసే తీర్పు ప్రజలు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసు అని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా…? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందని హెచ్చరించారు. రాబందు ప్రభుత్వం పోవాలి..కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.
పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రగతి, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి- జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. షేక్‌పేటలోని రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి తెలంగాణలో లోపాయి కారీగా కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బిజెపి బీ టీం అంటుందని మండిపడ్డారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని అన్నారు. బిజెపితో కలిసి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కూడా లేదని పేర్కొన్నారు.