మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కెసి వేణుగోపాల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్లు మీడియాలో, ప్రధానంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం. కాగా, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కల్పించుకుని అటువంటిదేమీ లేదని, మంత్రి కొండా సురేఖకు జిల్లాలోని ఇరువురు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం కారణంగా వివాదం చెలరేగిందని, అదంతా సమిసిపోయిందని వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏదైనప్పటికీ భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా చూడాలని,
సమన్వయం లేక రోడ్డున పడరాదని కెసి వేణుగోపాల్ వారితో అన్నారని సమాచారం. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ బలంగా ఉందన్న అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయరాదని ఆయన సూచించారు. మంత్రుల మధ్య విభేదాలు ఏమీ లేవని, తామంతా కలిసే ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వివరించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండే ఒకటి, రెండు పత్రికలే ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం వల్ల అపొహలకు, గందరగోళానికి దారి తీసినట్లు సమాచారం. ఒక పార్టీకి చెందిన పత్రిక కాబట్టే తప్పుడు కథనాలతో గందరగోళం సృష్టిస్తున్నదని ఆయన వివరించారని తెలిసింది.