న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ కలిసి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (ఆర్‌ఇఐఎల్) అని పేరు పెట్టారు. రిలయన్స్ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్‌లో ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్‌బర్గ్ సంస్థలు సంయుక్తంగా రూ.855 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఆర్‌ఇఐఎల్‌లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ 70 శాతం వాటా కలిగి ఉంటే, మిగిలిన 30 శాతం వాటాను మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ అనుబంధ సంస్థ అయిన ఫేస్‌బుక్ ఓవర్సీస్ ఇంక్ కలిగి ఉంది. రిలయన్స్ ఒక్కో షేరుకు రూ.10 చొప్పున 20 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి రూ.2 కోట్లు ప్రారంభ పెట్టుబడిగా పెట్టింది.
ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం ఎఐ సేవలను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడమే. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ఈ జాయింట్ వెంచర్‌ను ప్రకటించారు. మెటా ఓపెన్ సోర్స్ లామా మోడల్స్, రిలయన్స్ వ్యాపార పరిధిని ఉపయోగించి వివిధ రంగాలకు ఎఐ పరిష్కారాలను అందించడం ఆర్‌ఇఐఎల్ లక్షంగా ఉంది. ఆర్‌ఇఐఎల్ రెండు ప్రధాన ఉత్పత్తులపై పని చేస్తోంది – ఎంటర్‌ప్రైజ్ ఎఐ ప్లాట్‌ఫామ్- యాజ్- ఎ-సర్వీస్, ఇది కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా జనరేటివ్ ఎఐ మోడళ్లను అభివృద్ధి చేసుకునేలా చేస్తుంది.
ముందే కాన్ఫిగర్ చేసిన పరిష్కారాలు, ఇవి అమ్మకాలు, మార్కెటింగ్, ఐటి కార్యకలాపాలు, కస్టమర్ సేవ, ఫైనాన్స్ వంటి రంగాలకు అనుకూలంగా ఉంటాయి. లామా ఆధారిత ఎఐ మోడళ్లలో మెటా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇక రిలయన్స్ తన విస్తృత డిజిటల్ మౌలిక వసతులను, భారతదేశంలోని వేల వ్యాపారాలకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ ఎఐ పరిష్కారాలను క్లౌడ్, హైబ్రిడ్ వాతావరణాలలో వినియోగించవచ్చు. ఇది కంపెనీలకు ఖర్చులను తగ్గించడంలో, సామర్థ్యాన్ని పెంచడంలో దోహదం చేస్తుంది. రిలయన్స్ ప్రకారం, ఆర్‌ఇఐఎల్ స్థాపనకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఈ భాగస్వామ్యం భారత వ్యాపారాలకు ఎఐ టెక్నాలజీని సులభంగా అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగుగా పరిగణిస్తోంది.