నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
శనివారం ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ నటనతో కథకు లైఫ్ ఇచ్చారు. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘ తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ నటనతో ఆకట్టుకుంటారు”అని తెలిపారు.
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది”అని తెలియజేశారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి. ఈ సినిమా చూశాక దీక్షిత్ ఎంత మంచి నటుడు అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రష్మిక, దీక్షిత్‌తో మంచి నటనను రాబట్టాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, విద్యా కొప్పినీడి, బన్నీ వాస్, ఎస్‌కేఎన్, కృష్ణన్ వసంత్ పాల్గొన్నారు.