బబుల్‌గమ్ సినిమాతో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ సయ్యారేను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. కాల భైరవ అందమైన ఆర్కెస్ట్రేషన్ తో అద్భుతమైన ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ చంద్ర బోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించారు. మోగ్లీ 2025 డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ “కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతి పెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చబోతున్న సందీప్ కి శుభాకాంక్షలు.
ఈ సినిమాతో కాలభైరవ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. సయ్యారే పాట చాలా బాగుంది. ‘మోగ్లీ 2025’ మంచి విజయాన్ని అందుకోవాలి”అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే లవ్ స్టోరీ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ “కాలభైరవ ఈ పాటని చాలా ప్రేమతో కసితో చేశాడు. సందీప్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. సాక్షి చాలా సహజంగా నటించింది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ “మంచి ఎమోషన్స్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. సినిమాని ఎక్కడ రాజీపడకుండా నిర్మించిన విశ్వ ప్రసాద్‌కి జీవితాంతం రుణపడి ఉంటాను. రోషన్, సాక్షి అద్భుతంగా నటించారు. కాలభైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా మంచి సినిమా తీశాం”అని తెలియజేశారు. ఈ వేడుకలో హీరోయిన్ సాక్షి, నిర్మాత కృతిప్రసాద్, కాలభైరవ, వైవా హర్ష పాల్గొన్నారు.