సిడ్నీ: నేను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో వస్తామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణం అద్భుతమేనని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో రోహిత్ శర్మ(121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74 నాటౌట్) అజేయ అర్థ శతకంతో రాణించాడు. మ్యాచ్ అనంరతం రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్‌కు వస్తామో లేదో తెలియదు. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను’అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ దిసిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదప్రర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.