ఒడిశా లోని మయూర్భంజ్ జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు తమ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినప్పటికీ వారి తల్లిదండ్రులు రాసగోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 13, 14 ఏళ్ల బాలికలు ఇద్దరు బాలురతో కలిసి సమీపాన జాతర లేదా థియేటర్‌కు చూడడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొంతమంది యువకులు వారిని అడ్డగించారు.
బాలురపై దాడి చేసి బాలికలను తమ మోటారు సైకిళ్లపై బలవంతంగా తీసుకెళ్లిపోయారు. బాధితులు 8,9 తరగతులు చదువుతున్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకున్నామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిఎన్‌ఎస్, పోస్కో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై విపక్షం బీజేడీ మండిపడింది. గత 16 నెలల్లో ఒడిశాలో 5000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పాలనలో మహిళలకు భద్రత క్షీణించిందనడానికి ఈ సంఘటనలే సాక్షమని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ధ్వజమెత్తారు.