బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
ఉద్యోగ ఖాళీలు ప్రకటించి, భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
మన తెలంగాణ/గోదావరిఖని: రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆసిఫాబాద్ వెళ్తున్న సిపిఎం రాష్ట్ర బృందం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌కు గోదావరిఖని వద్ద పార్టీ జిల్లా నాయకత్వం శనివారం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన, బిల్లు, ఆర్డినెన్స్, .ఇఒలను తీసుకు వచ్చినప్పటికీ కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అమలు జరగాలంటే రాష్ట్రం నుంచి గెలిచిన బిజెపికి చెందిన 8 మంది ఎంపిలు, 8 మంది ఎంఎల్‌ఎలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి అమలు చేయించాలని, తమ పదవులకు లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు టి.రాజారెడ్డి, ఎన్.బిక్షపతి, సిహెచ్.శైలజ, గీట్ల లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.