లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఉద్యమ నేతలను జాతీయ భద్రత నెపంతో అక్రమంగా కేసులు బనాయించి నిర్బంధించడం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. ఈ ఆందోళనలు సెప్టెంబర్ 24న హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. ఈ హింసాకాండకు పర్యావరణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ సూత్రధారి అన్న ఆరోపణలతో అరెస్టు చేసి రాజస్థాన్ లోని జోథ్‌పూర్ జైలులో నిర్బంధించారు. అంతేకాదు ఆయన భార్య గీతాంజలి ఆంగ్‌మోపై కూడా తీవ్ర నిఘా కొనసాగిస్తుండడం కేంద్ర ప్రభుత్వ దమననీతికి తార్కాణం. ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా, ఎక్కడికీ వెళ్లనీయకుండా దర్యాప్తు సంస్థలు నీడలా వెంటాడుతున్నాయి.
జోథ్‌పూర్ జైలులో ఉన్న తన భర్త వాంగ్‌చుక్‌ను కలుసుకోవడానికి ఆమె వెళ్లినప్పుడల్లా లేనిపోని ఇబ్బందులను సృష్టించడం పరిపాటిగా సాగుతోంది. అక్టోబర్ 7, 11 తేదీల్లో జోథ్‌పూర్ వెళ్లినప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు, రాజస్థాన్ పోలీసులు ఏ విధంగా నిబంధనల చట్రంలో ఇరికించారో, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా ఆటంకం కలిగించారో అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు విన్నవించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విమానాశ్రయం నుంచి తాను బయటకు రాగానే దర్యాప్తు అధికారులు నేరుగా తనను తమ కారులో జైలు సూపరింటెండెంట్ ఆఫీసుకు తీసుకెళ్లారని, ఆ కారు కిటికీలకు తెల్లటి తెరలు కప్పి ఉంచారని ఆరోపించారు. తన భర్తతో మాట్లాడుతున్నంత సేపు ఇద్దరు ఆఫీసర్లు అక్కడే కూర్చుని అంతా ఆలకిస్తుంటారని ఇలా ప్రతిసారీ జరుగుతోందని ఆమె ఆరోపించారు.
తాను భర్తతో ఏం మాట్లాడుతున్నానో ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించవలసిన తమ హక్కుకు విరుద్ధంగా వారు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) లను ఉల్లంఘించడమే అవుతుందని ఆమె సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు. జోథ్‌పూర్‌లో తాను ఎవరినీ కలియనీయకుండా నేరుగా రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చి, రైలెక్కించడం దగ్గరనుంచి వచ్చే స్టేషన్ వరకు ఎస్కార్ట్ ఉంటోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో తన బస నుంచి ఎక్కడకు వెళ్లినా కారు వెంబడిస్తుందని, దాంతోపాటు మోటారు సైకిల్‌తో మరొకరు అనుసరిస్తుంటారని ఈ విధంగా నిఘా వెంటాడడం ఎంతవరకు న్యాయం? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఓ భారతీయ స్వేచ్ఛా పౌరురాలిగా నాకు నచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు జోథ్‌పూర్‌కు వెళ్లే హక్కు నాకుంది.
రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నా భర్తను కలుసుకునే హక్కుంది. తాను ఉగ్రవాదినా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే గీతాంజలి ఆంగ్‌మో ఆరోపణలన్నిటినీ యథాప్రకారం నిరాధారమైనవిగా లదాఖ్ కేంద్ర ప్రాంత హోమ్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతున్నాయి. పర్యావరణ ఉద్యమనేత సోనమ్ వాంగుచుక్‌ను అరెస్టు చేయడం సరిహద్దులో అత్యంత సున్నితమైన రీజియన్ లద్దాఖ్‌లో పరిస్థితి మరింత క్షీణించడానికి దారి తీస్తోంది. రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను అనుసంధానించి లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రభుత్వ హోదా కల్పించాలన్న డిమాండ్లతో లద్దాఖ్ లోని పౌర సంఘాలు సాగిస్తున్న ఆందోళనలకు వాంగ్‌చుక్ ప్రధాన కారకుడని కేంద్రం వాదిస్తోంది. వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడానికి కేంద్రం ఉపక్రమించడం ఏమంత తెలివైన పని కాదని, వాస్తవాలకు విరుద్ధం గా ఉంటోందని తెలుస్తోంది. లేహ్ లోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్)పై దర్యాప్తులు సాగిస్తున్నారు.
ఆ స్కూల్‌కు వాంగ్‌చుక్ సహ సంస్థాపకులు అయినప్పటికీ, ఆ సంస్థ యాజమాన్యంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్రం ఆ సంస్థకు సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ (ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టం) లైసెన్సును రద్దు చేసింది. పూర్వపు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిన వారిలో వాంగ్‌చుక్ ఒకరు. దీనివల్ల లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా వస్తుందని, రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను చేర్చడం వల్ల లద్దాఖ్ సహజ సంస్కృతి, వారసత్వాలకు రక్షణ కలుగుతుందని వాంగ్‌చుక్ ఆశించారు. కనీసం ఆరో షెడ్యూల్‌నైనా కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం బహిరంగంగా హామీ ఇచ్చింది.
కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను విభజించిన తరువాత జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక పద్ధతులను అవలంబించడానికి దారి తీశాయి. స్థానిక జనాభాను దూరం చేస్తున్నారన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో కేంద్రం తాత్కాలిక ఒప్పందానికి వచ్చి గత మే 27న ఆయా గ్రూపులతో చర్చలు ప్రారంభించినా అస్పష్టమైన కారణాలు బయటపడ్డాయి.కేంద్రంపై అసమ్మతి వర్గాల అపనమ్మకం స్పష్టమైంది. వాంగుచుక్ జోథ్‌పూర్ జైలులో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చలు కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాఖ్ ప్రతినిధులైన లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) పాల్గొన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ సహా అరెస్టు అయిన ముఖ్యమైన నాయకులను వెంటనే విడుదల చేయాలని లద్దాఖ్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ చర్చలు ఇంకా ఎటూ తేలలేదు. మరోసారి చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.