రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు. జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు.
భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.