మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు రాగా, చివరి రోజు (గురువారం) 4,822 దరఖాస్తులు వచ్చాయి. బిసి బంద్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సులు నడవకపోవడం, కొన్ని చోట్ల బ్యాంకులు పని చేయక పోవడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ మద్యం షాపులకు దరఖాస్తుల గడవు ఈ నెల 23 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఔత్సాహికులు మరిన్ని దరఖాస్తులు చేసుకున్నారు. కాగా, రంగారెడ్డి డివిజన్‌లో 29,420 అత్యధికంగా రాగా, అదిలాబాద్ డివిజన్‌లో అల్పంగా 4,154 వచ్చాయి. రాష్ట్రంలోని 2, 620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులకు ఈ నెల 27న డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరిండెంట్‌లు, జిల్లా వారిగా మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో ఈ డ్రా తీయనున్నట్లు అధికారులు వెల్లడించారు.