మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి వర్షం బెడద వెంటాడుతూనే ఉంది. వర్షం వల్ల ఇప్పటికే పలు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయ్యాయి. తాజాగా శుక్రవారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం తడిసి ముద్దయ్యింది. పాకిస్థాన్ స్కోరు 4.2 ఓవర్లలో 18/0 ఉన్న సమయంలో వర్షం మొదలైంది. అది కుంభవృష్ఠిగా మారడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో పాకిస్థాన్, శ్రీలంక జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో పాక్, లంక జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ విజేత ఇంగ్లండ్‌తో పాటు ఆతిథ్య టీమిండియా, సౌతాఫ్రికా టీమ్‌లు సెమీస్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు కూడా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేక పోయింది. మూడు మ్యాచ్‌లు రద్దు కావడంతో పాయింట్ల ఖాతా తెరిచింది. లంక కూడా ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.