గాజా యుద్ధం “ముగిసిపోయిం”దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారో లేదో, ఇక ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగింప జేయగలరని భావించారు పలువురు. ఆ మేరకు పాశ్చాత్య మీడియాలో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వెలువడ్డాయి. ఒక యుద్ధం ఆగినపుడు ఆ వాతావరణంలో ఇటువంటి ఆలోచనలు కలగటం సహజం. పైగా, ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎప్పుడు ఏ దేశాధినేత చేయని విధంగా బహిరంగంగా, తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్న రోజులవి. చివరకు తనకు ఆ బహుమతి రాకపోవటం ఒకటి కాగా, అసలు గాజా యుద్ధం నిజంగా ఆగినట్లేనా అనే సందేహాలు ఏర్పడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. గాజా అన్నది కేవలం గాజా ప్రాంతానికి పరిమితమైన ప్రశ్న కాదు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌ను కూడా కలుపుకొన్న విస్తృతమైన పాలస్తీనా విషయమది.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య తీవ్రమైన సాయుధ ఘర్షణలు గాజాలో జరిగినందున చర్చ అంతా గాజా గురించి జరిగింది. అమెరికా అధ్యక్షుని 20 అంశాల ప్రాతిపదికగా జరిగింది కాల్పుల విరమణే తప్ప యుద్ధ విరమణ కాదు. అయినప్పటికీ పాశ్చాత్య మీడియా ఆ విధంగా ప్రచారం చేసింది. అదట్లుంచి, ఆ 20 అంశాల ప్రణాళిక అయినా సమస్యకు చిరకాల పరిష్కారం చూపగలది కాదు. ఆ అంశాలను ఒక్కొక్కటిగా, జాగ్రత్తగా పరిశీలించినపుడు, వాటిలో చిక్కులమారివి అనేకం కనిపిస్తాయి. ప్రస్తుత కాల్పుల విరమణ అన్నది తాత్కాలికమైన తొలి దశ కాగా, దాని అమలు అయినా ఎంత సజావుగా జరగవచ్చుననే సందేహాలు వెంటనే తలెత్తాయి. అందుకు తగినట్లే ఇజ్రాయెల్ తమ బందీలను విడుదల చేయించుకున్నదో లేదో గాజాపై ఏదో ఒక సాకు చెప్తూ తిరిగి దాడులు ఆరంభించింది. సహాయ సరఫరాలకు ఆటంకాలు కల్పించటం మొదలు పెట్టింది. తాము, ఇజ్రాయెల్ కలిసి హమాస్‌ను నాశనం చేయగలమంటూ బెదిరింపులు జారీ చేయటం ఆరంభించారు ట్రంప్.
పరిస్థితి మామూలు అంశాలలోనే, కొద్ది వారాలలోనే ఈ విధంగా పరిణమిస్తున్నపుడు, 20 అంశాల ప్రణాళికలో గల కీలక అంశాల అమలు దశకు వెళ్లినపుడు ఏమి జరగవచ్చుననే భయాలు కలుగుతున్నాయి. ఆ కీలక అంశాలలో బయటి వారితో తాత్కాలిక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, తాత్కాలిక శాంతి భద్రతల వ్యవస్థ ఏర్పాటు, గాజా అభివృద్ధికి బయటివారే ప్రణాళిక రచనచేసి అమలు పరచటం వంటివి ఉన్నాయి. ఇక సమస్య అంతటికీ మౌలిక అంశమైన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు సంబంధించి గల మాటలను గమనిస్తే, అసలు ఆ ఉద్దేశమైనా ఉందా లేదా అనిపిస్తుంది. పాలస్తీనా ఏర్పాటుకు ఎంత మాత్రం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే నేటికీ ప్రకటిస్తుండటం, ఆ విషయమై ట్రంప్ మౌనాన్ని గమనించినపుడు ఎవరికీ అసలా నమ్మకమే ఏర్పడటం లేదు. ఇదంతా చూసినపుడు, అమెరికా ఇజ్రాయెల్‌ల ఉమ్మడి ప్రణాళిక గాజాను, వెస్ట్ బ్యాంక్‌ను క్రమంగా స్వాధీనపరచుకుని, నెతన్యాహూ అంటున్నట్లు గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయటమనే అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల, గాజాలో జరిగింది యుద్ధ విరమణ కాదు గదా కనీసం కాల్పుల విరమణ అని కూడా నిజమైన అర్థంలో అనలేము. ఇక రాగల రోజులలో ఏమి జరగవచ్చునన్నది వేచి చూడవలసిందే.
ఇదంతా అట్లుంచితే, అమెరికా శిబిరపు దృక్కోణం నుంచి చూసినపుడు గాజా, ఉక్రెయిన్ పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు రెండూ కనిపిస్తాయి. ఆ శిబిరపు సామ్రాజ్యవాద ప్రయోజనాల దృష్టా వ్యూహాత్మక అంశాలు రెండు చోట్లా ఉన్నాయి. పాలస్తీనా అన్నది పశ్చిమాసియాలో మధ్యధరా సముద్ర తీరాన ఉంది. భౌగోళిక వ్యూహాల రీత్యా అది కీలక ప్రదేశం. అదిగాక ఆ ప్రాంతమంతటా అపారమైన ఇంధన నిక్షేపాలున్నాయి. యూరప్‌ను ఆఫ్రికా, ఆసియాలలో అనుసంధానం చేసే సూయెజ్ కాల్వ ఉంది. కనుకనే బ్రిటిష్ వలస రాజ్యం అక్కడ తమ పాగా వేసేందుకు ఇజ్రాయెల్‌ను సృష్టించింది. అమెరికా సామ్రాజ్యవాదం, యూరప్‌లు అందుకు జత చేరాయి. అప్పటి నుంచి పాలస్తీనాను ప్రత్యక్షంగా, ఆ ప్రాంతంలోని అనేక అరబ్ రాజ్యాలను పరోక్షంగా తమ చెప్పుచేతలలో ఉంచుకుంటూ వస్తున్నాయి. అక్కడి వారికి కొరకరాని కొయ్యగా మిగిలింది ఇరాన్ ఒక్కటే. దానితోపాటు వివిధ తిరుగుబాటుదార్ల సంస్థలు.
ఈ నేపథ్యాన్నంతా చూసినపుడు అమెరికన్ శిబిరానికి గాజాగాని, వెస్ట్ బ్యాంక్ గాని వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనవో గ్రహించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో హమాస్ రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై జరిపిన ఆకస్మిక దాడి యావత్ అమెరికన్ శిబిరాన్ని, దానికి అనుబంధంగా మారిన అరబ్ రాజ్యాలను పెద్ద కుదుపు కుదిపింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ కాలంలో ఉండిన పాన్ అరబిజం ఆయన మరణం తర్వాత సమసిపోగా, ఆ తర్వాత నుంచి అమెరికాను అనుకూలంగా మారిన అరబ్ రాజ్యాలు తద్వారా ఇజ్రాయెల్‌తో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకోసాగాయి. కొందరు ఆ పని చేసి, మరికొందరు కూడా చేయనుండగా చోట చేసుకున్న హమాస్ దాడితో వారు వెనుకడుగు వేయవలసి వచ్చింది.
గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో, ప్రపంచ దేశాలలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనగా, ఆ స్థితి నుంచి బయటపడటం అమెరికా శిబిరానికి అవరసమైంది. దానితో, పాలస్తీనా దేశం ఏర్పాటు ఉద్దేశమైతే ఇప్పటికీ లేదు గాని, ఏదో ఒక విధంగా ప్రస్తుత క్లిష్ట స్థితిని తప్పించుకోజూసారు. ఆ విధంగా, 20 అంశాల ప్రణాళిక పేరిట మభ్యపెట్టే పథకం ఒకటి తయారు చేసారు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, గాజా ఒక చిన్న ప్రాంతం, హమాస్ ఒక పరిమిత శక్తి, అరబ్ రాజ్యాలకు చిత్తశుద్ధి లేకపోవటం అనే వాటిని అనువుగా చేసుకుని అమెరికా తన జిత్తులమారి వ్యూహాన్ని అమలుకు తేగలిగింది. ఆ విధంగా మొత్తం పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను నిలబెట్టుకోగలుగుతున్నది. ఆ పని తేలికగానూ జరుగుతున్నది.
కాని ఉక్రెయిన్ పరిస్థితి అటువంటిది ఎంత మాత్రం కాదు. పాశ్చాత్య ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ కీలక స్థానం తక్కువ అనలేము. ఇంకా చెప్పాలంటే పశ్చిమాసియా కన్న ఎక్కువ. ఎందుకంటే అక్కడికి పొరుగున తమ పోటీదారులు, బద్ధశత్రువులు, దీర్ఘకాలిక సవాలుగా నిలిచేవి అయిన రష్యా, చైనాలున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా ప్రపంచాధిపత్యానికే సవాలు అన్నదగ్గవి లేవు. కాని ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, చైనాలు ఉన్నాయి. అందువల్ల ఆ సవాలు అతి తీవ్రమైనది. ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదనటం అందువల్లనే.
గాజాకు, వెస్ట్ బ్యాంక్‌కు భిన్నంగా రష్యా, చైనాలు అతి విశాలమైనవి. మహా శక్తివంతమైనవి. ఆ రెండింటి నాయకత్వాలు పటిష్టమైనవి. రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ బలం ఎందుకూ కొరగాదు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌ల ఆయుధ, ఆర్థిక సహాయాలు ఉండి కూడా నిలవలేకపోతున్నది. భూభాగాలను క్రమంగా కోల్పోతుండగా సైన్యాన్ని నష్టపడుతున్నది. అమెరికా, యూరప్‌తోడు నిలవకపోతే ఎన్నడో ఓడిపోయేది. రష్యాపై అమెరికా, యూరప్‌లు వందలాది ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించినా ఫలితం ఉండటం లేదు.
ఇతరత్రా ఏ హెచ్చరికలూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్‌ను మరింత ఆధునికమైన ఆయుధాలు ఇవ్వగలమని పాశ్చాత్య దేశాలు ప్రకటించినపుడల్లా రష్యా సరికొత్త ఆయుధాలను రంగంలోకి తెచ్చి ప్రయోగిస్తున్నది. అణ్వస్త్రాలను ఉపయోగించే ఉద్దేశమైతే లేదు గాని, అవసరమైతే ఆ పని చేయగలమని పలుమార్లు హెచ్చరించింది. అందుకు అనుగుణంగా తమ అణ్వస్త్ర ప్రయోగ విధానాన్ని ఇప్పటికే సవరించింది కూడా. గత విధానం ప్రకారం, ఒకవేళ శత్రువు దాడి తన ‘ఉనికికే’ ముప్పు కలిగించినట్లయితే ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. సవరించిన విధానం ప్రకారం ఒకవేళ తమ ‘సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు.. తీవ్రమైన ప్రమాదం’ కలిగితే ఉపయోగిస్తారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నపుడు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేసే ప్రతిపాదన చేయగా పుతిన్ తమ విధానాన్ని ఆ విధంగా మార్చారు. దానితో బైడెన్ క్షిపణులు ఆగిపోయాయి. అదే విధంగా ట్రంప్ గత వారం సరఫరా చేయగలమన్న తొమాహాక్ క్షిపణులు.
ఇటువంటివి అనేకం పరిగణనలోకి తీసుకున్నందువల్లనే, ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదని అనవలసి వస్తున్నది. అమెరికా శిబిరం ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంత భయపెట్ట జూసినా, ఉక్రెయిన్‌కు సహాయపడుతూ యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగించినా, హమాస్ వలె రష్యాను ఏదో ఒక ఉపాయంతో లొంగదీయటం అసంభవం. ఇది గత మూడేళ్ల యుద్ధకాలంలో ఉక్రెయిన్, అమెరికా, యూరప్‌లకు బాగా బోధపడిన విషయమే, అందువల్ల ఆ శిబిరం వాస్తవాలను అంగీకరిస్తూ రష్యాతో రాజీపడటం మినహా గత్యంతరం లేదు. విచిత్రమేమంటే ఈ మాట ట్రంప్‌కు సరిగానే అర్థమైంది. భేషజాలకు పోతున్నది ఉక్రెయిన్, వారి యూరోపియన్ మిత్రులే.
– టంకశాల అశోక్ (దూరదృష్టి)
– రచయిత సీనియర్ సంపాదకులు