బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుంభ కర్ణుడిలా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. రామాయణంలో కుంభ కర్ణుడు ఆరు నెలలు తిని, ఆరు నెలలు పడుకున్నట్లు పురాణంలో ఉందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష ఓట్ల మెజారిటీతోఒ గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడాలి అనుకున్న కెసిఆర్ పార్టీ ఆఫీసుకు వెళ్ళకుండా, తాను ఉంటున్న ఫామ్ హౌజ్‌కే పిలిపించుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో దళితులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే గతంలో కెసిఆర్ సిఎం అయ్యారని ఆయన అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమి చవి చూసినా, కెసిఆర్ అహంకారం మాత్రం తగ్గలేదని ఆయన విమర్శించారు.
బీర్లపై ఎసిబి, ఆదాయ పన్నుశాఖలకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు
ఇదిలాఉండగా బీర్ల ఐలయ్య రెండేళ్ళలో రెండు వందల కోట్ల రూపాయలు ఎలా ఆర్జించారన్న అంశంపై దర్యాప్తు చేయాలని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మహేష్ బొడుసు అవినీతి నిరోధక శాఖ డిజికి, ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.