న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. బదులుగా వర్చువల్‌గా పాల్గొంటారని అధికారికంగా ప్రకటించారు. మోడీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ఫోన్‌లో ఆత్మీయ సంభాషణ అనంతరం , మోడీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ అభించినందుకు అభినందించారు.
ఆసియాన్ కూటమిలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, తదితర దేశాలు చర్చల్లో పాల్గొననున్నా యి . మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ , వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. షెడ్యూల్ సమస్యల వల్లనే మోడీ ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ మోడీ భేటీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లయింది.