నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య టీమిండియా తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు నెలకొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగు పడుతాయి. ఒక వేళ న్యూజిలాండ్ ఓడిపోతే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కివీస్ సెమీస్ రేసులో నిలుస్తోంది. ఓటమి పాలైతే మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.
వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇలాంటి స్థితిలో కివీస్‌తో పోరు కీలకంగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న టీమిండియా బలమైన కివీస్‌కు ఎలాంటి పోటీ ఇస్తుందో చెప్పలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా సమష్టిగా రాణించడంలో భారత క్రికెటర్లు విఫలమవుతున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన బాధ్యత జట్టు సభ్యులపై నెలకొంది.
మంధానపైనే ఆశలు..
ఇక కొంత కాలంగా అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో మంధాన అద్భుత బ్యాటింతో అలరించింది. అయితే కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మంధాన నుంచి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను జట్టు ఆశిస్తోంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హర్మన్ గాడిలో పడడంతో భారత బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది.
కాగా, కీలక బ్యాటర్లు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇక సీనియర్ క్రికెటర్ దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా దీప్తి సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరోవైపు బౌలింగ్ వైఫల్యం కూడా టీమిండియాను వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. ఇదిలావుంటే ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌తో పోరు న్యూజిలాండ్‌కు కూడా సవాల్‌గా తయారైంది. రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో హోరాహోరీ సమరం ఖాయమనే చెప్పాలి.