పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించారు. గురువారం ఇండియా కూటమికి చెందిన అగ్రనేతల భేటీ తరువాత తేజస్వీ తమ కూటమి అభ్యర్థి అనే విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు కూటమిలో బీటలు తలెత్తకుండా ఉండేందుకు, సంఘటితంగా ప్రచారానికి దిగేందుకు , గందరగోళానికి తెరదించేందుకు సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిక్కిరిసిన ప్రెస్‌మీట్‌లో నేతలు ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సిఎం తేజస్వీ యాదవ్ అవుతారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా కూటమిలోని చిన్న భాగస్వామ్యపార్టీలు వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ (విఐపి) అధ్యక్షులు ముఖేష్ సహాని, రాష్ట్రంలోని బలహీనవర్గాలకు చెందిన నేతలను సహ ఉప ముఖ్యమంత్రులు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ తెలిపారు.
బీహార్‌లోని సంక్లిష్ట సామాజిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సిఎం అభ్యర్థి, కొన్ని సీట్లపై సర్దుబాట్ల వ్యవహారం కూటమిలో చిలికిచిలికి గాలివాన అయ్యే ముప్పు దశలో పరిస్థితిని చక్కదిద్దేందుకు గెహ్లోట్ బుధవారమే పాట్నాకు వచ్చారు. తోటి సీనియర్ నేత ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చాలా సేపు మాట్లాడారు. సిఎం పేరు, డిప్యూటి సిఎంల విషయంలో ఇప్పటి నిర్ణయానికి పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆమోదం ఉందని గెహ్లోట్ చెప్పారు. ముందుగా వారితో మాట్లాడటం జరిగింది. తరువాతి క్రమంలో ఇప్పుడు నిర్ణయాన్ని సంకీర్ణ భాగస్వామ్యపక్షాల నేతలందరం కలిసి ప్రకటిస్తున్నామని తెలిపారు.
ఈ వేదిక నుంచే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా మాట్లాడారు. తనపై మరోమారు నమ్మకం ఉంచినందుకు మహాఘట్‌బంధన్ నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని, నేరాలకు పాల్పడే వారు ఎవరైనా శిక్షించితీరుతామని ప్రకటించారు. ఈ విషయంలో చివరికి తన నీడను కూడా సహించేది లేదన్నారు. ఇప్పుడు తమ తరఫున సిఎం ఎవరనేది తెలియచేశాని ఆ తరువాత కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం సారధి పవన్ ఖేర్ తెలిపారు. ఇక ఎన్‌డిఎ వంతు వచ్చింది. వారి సిఎం అభ్యర్థి ఎవరనేది తెలియచేస్తారా? అని నిలదీశారు. కూటమి అంటే సమూహం, ఏక వ్యక్తి ప్రాతిపదికం (ఒన్ మెన్‌షో) కాదని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది.
బీహార్‌లో పూర్వపు మహాఘట్‌బంధన్, ఇప్పటి ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడి నడుమ తీవ్రస్థాయి విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. కూటమిలో ఒన్ మెన్ షో ఉండదు. పరస్పర విశ్వాసం, కలిసికట్టు ప్రాతినిధ్యంతోనే ముందుకు సాగుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తమ మధ్యవిభేదాల సృష్టికి యత్నించిన వారు ఇప్పుడు చతికిల పడిపోతారని పవన్ ఖేర్ స్పందించారు. అంతా తామే తమదే అనుకునే బిజెపి రకం , అందులోని నేతల తంతు తమది కాదని ఇప్పుడు తాము ప్రజల వద్దకు మరింత స్పష్టమైన రీతిలో ముందుకు సాగుతామని వెల్లడించారు.