వాషింగ్టన్ : భారతదేశం అమెరికా చాలా కాలంగా చర్చలలో ఉన్న వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు 15 లేదా 16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తుల నుంచి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ బుధవారం మింట్ ఈ వార్త రిపోర్ట్ చేసింది. ఇంధనం, వ్యవసాయానికి సంబంధించిన భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒప్పందం కుదిరితే భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. అమెరికా నుంచి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను చేసుకునేందుకు భారత్ అంగీకరించవచ్చని , ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని మింట్ పేర్కొంది.