మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో తీవ్ర కలకలం రేపిన తుని రేప్ కేసు ఘటనలో నిందితుడైన 63 ఏళ్ల తాటిక నారాయణ రావు చెరువులో శవమై కనిపించారు. గజ ఈతగాళ్లు గాలించి ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం బయటికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తుని రూరల్ పోలీసులు చెప్పారు. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డా డంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు వెల్లడించారు. మైనారిటీ తీరని బాలికపై ఆమె సమ్మతితోగానీ, అసమ్మతితో గానీ లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందికి వస్తుందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి.
ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు రాజకీయంగానూ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని హంసలవలస వద్ద ఉన్న ఒక తోటలో తాటిక నారాయణరావు అనే వ్యక్తి మైనర్ బాలికతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న వీడి యో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ అమ్మాయిని తోటకి తీసుకొచ్చి పాడుచేస్తున్నావా? బట్టలు విప్పేసి ఏం చేస్తున్నావంటూ వీడియో తీస్తున్నవారిగా భావిస్తున్న వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్ అంటే తీసుకొచ్చానని నారాయణరావు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ బాలిక దుస్తులు ధరిస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. తాను మున్సిపల్ కౌన్సిలర్‌ను అంటూ వీడియో తీస్తున్న తనను ప్రశ్నిస్తున్న వ్యక్తిని నారాయణరావు గద్దిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.
మైనర్ బాలికపై అత్యాచారం కేసుపై సంబంధిత తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు మాట్లాడారు. ‘బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కూతురిపై లైంగిక దాడి జరిగినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. విచారించినప్పుడు, తునిలోని కొండవారిపేటకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తాటిక నారాయణరావు బాలికకు తాను తాతనని చెప్పి ఆ మైనర్‌ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. సిసిటివి కెమెరాలో కూడా రికార్డ్ అయింది. వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం‘ అని సీఐ వెల్లడించారు. తాత అని చెప్పి బాలికను నారాయణ రావు బయటికి తీసుకెళ్లినట్లు స్కూల్ రిజిస్టర్ లో నమోదై ఉందన్నారు. “గతంలో కూడా ఆయన స్కూలు వద్దకు వచ్చి బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చేవాడు. ఆ బాలిక కూడా ఆయన తన తాత అని చెప్పింది. మొన్న వచ్చినప్పుడు బాలికకు రక్తహీనత ఉందని, ఇంజెక్షన్ కోర్సు వేయిస్తున్నామని, ఇప్పటికి మూడు అయ్యాయని, 4వది వేయించాలని చెబితేనే పంపించాం” అని గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అమ్మాయి ఏడస్తుండటాన్ని చూసి, ఏం జరిగిందని అడిగితే, జరిగిన విషయం చెప్పినట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు.
గతంలోనూ రెండుసార్లు బయటికి తీసుకెళ్లినట్లు తన కూతురు చెప్పిందని బాలిక తల్లి పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘అనంతరం, బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు‘ అని సిఐ చెన్నకేశవరావు తెలిపారు. నిందితుడిపై రేప్, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కాలకృత్యాలకని చెప్పి పోలీసు వాహనం దిగి
ఈ కేసుకు సంబంధించి నిందితుడు నారాయణరావును బుధవారం మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించా రు. ‘అనంతరం, ప్రొసీజర్ ప్రకారం నిందితుడికి వైద్య పరీక్షల కోసం తరలించాం. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ఆయన కుమారుడికి అరెస్ట్ సమాచారం అందించేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత, రాత్రి 10 గంటలకు వాళ్లబ్బా యికి అరెస్టు సమాచారం ఇచ్చాం. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు రాత్రి 10.20 గంటలకు పోలీసులు జీపులో బయలుదేరారు. దారిలో కోమటి చెరువు వద్దకు వచ్చేసరికి కాలకృత్యాలు తీర్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తే పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు పక్కనే ఉన్న పాక కిందకు వెళ్లారు.
కొద్దిసేపటికి నిందితుడు పైకి లేవడం కనిపించింది, ఆ తర్వాత చెరువులో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి చూడడంతో ఆయన కనిపించలేదు. చెరువులో దూకేశారా? లేదా పారిపోయారా? అని వెతకడం ప్రారంభించారు” అని తుని రూరల్ సిఐ చెన్నకేశవ రావు తెలిపారు. “రాత్రి చెరువులో గాలించాం. చీకటిపడడంతో ఉదయం గాలింపు చర్యలు చేపట్టాం. గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది‘ అని సిఐ వెల్లడించారు. నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
రాజకీయ దుమారం
అయితే, నారాయణరావు బాలికతో తోటలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎపిలో రాజకీయ దుమారం రేగింది. నిందితుడు నారాయణ రావు మెడలో టిడిపి జెండా ఉన్న ఫోటోలను వైసిపి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టిడిపి నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారని మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తూ కాలకేయుల్లా మారారంటూ విమర్శలు చేశారు. ‘ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది‘ అని అన్నారు. తుని ఘటన తెలుసుకుని షాక్‌కి గురయ్యానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. ‘సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇటువంటి ఘటనలకు పాల్పడే వారెవరైనా ఉక్కుపాదంతో అణచి వేస్తాం‘ అని ఆయన తన పోస్టులో వెల్లడించారు. బాధితురాలికి ధైర్యం కల్పించేలా కౌన్సిలింగ్ ఇప్పించి, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది‘ అని తెలుగుదేశం పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి‘ అని ఆ పార్టీ ఆ పోస్టులో రాసింది.
ఎవరీ నారాయణరావు?
తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణ రావు గతంలో 2009 నుంచి 2011 వరకు పట్టణ ఎస్‌సి, ఎస్‌టి సెల్ అధ్యక్షుడిగా చేశారని తెలిసిందని సిఐ వెల్లడించారు. అయితే, ఏ పార్టీ అనేది తెలియదన్నారు. కొండవారి పేటలో సెటిల్మెంట్లు చేస్తుంటారని తెలిసిందని ఆయన అన్నారు. గతంలో ఆయనపై ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఎలాంటి కేసులూ లేవని, ఆ పేటలోనే ఏదో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారని తెలిసిందన్నారు.
ఇదిలా ఉండగా, “మా నాన్న చేసింది తప్పే. పరువు పోయిందని ప్రాణం తీసుకున్నాడు. అని నారాయణ రావు కుమారుడు సురేష్ చెప్పారు. అయితే ఆయన ఎలా చనిపోయాడో పోలీసులు మాకు చెప్పాలి అని ఆయన కోరారు.