ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సగం పాలనతో రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు ఆగమాగం అవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఏ పని చేసినా సగమే చేస్తారు తప్ప పూర్తిగా చేసింది ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ప్రతి పంటను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేయడంతో పాటు బోనస్ ఇస్తామని గొప్పలు చెప్పి, ్డ ధాన్యం కొనుగోలుపై నిబంధనలు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఎకరాకు 18 క్వింటాళ్ల మక్కను కొనుగోలు చేస్తామని రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన సగం పంటను కొనుగోలు చేసి మిగతా పంట బయట అమ్ముకోవాలంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు గొప్పలు చెప్పి, అధికారంలోకి రాగానే రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి కనీసం 25 నుంచి 30 ఎకరాల మక్కా పంట వస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అడగంగా అడగంగా అరిగోస పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో దళారులకు తక్కువ దొరకే రైతులు ధాన్యాన్ని విక్రయించి ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సిద్దిపేట మార్కెట్ యార్డులోనే 14 వేల క్వింటాళ్ల మక్క దళారుల పాలైందని అన్నారు. ఒక పంటకు బోనస్ ఇచ్చి మరొక పంటకు ఎగ్గొట్టారని, సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఆయన వెంట వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, నల్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల అరవింద్ రెడ్డి, నర్సింలు, రమేష్ తదితరులు ఉన్నారు.