ఇండియా రష్యా చమురు వాటా తగ్గుముఖం
ట్రేడ్, పాకిస్థాన్‌తో సయోధ్య విషయాల ప్రస్తావన
వ్యాపార దిగ్గజాల సమక్షంలో ప్రమిద జ్యోతి
వాఫింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలు చాలా బాగున్నాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, భారత ప్రజలను ఆయన కొనియాడారు. ఎంతో మంచి సంబంధాలు ఉన్న ఇరుదేశాలూ రష్యా ఉక్రెయిన్ చిరకాల యుద్ధం సమసిసోవాలని కోరుకుంటున్నాయని ట్రంప్ చెప్పారు. సుంకాలు, వీసా అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వ్యవహారాల దశలో భారత్ అమెరికా సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ దశలోనే ట్రంప్ ఆశాభావ వ్యాఖ్యలు వెలువడ్డాయి. మంగళవారం వైట్‌హౌస్‌లో రంగుల విద్యుద్దీపాల అలంకరణలతో వేడుక జరిగింది. భారతీయ సంతతి వ్యాపారవేత్తలను, సామాజిక వర్గాన్ని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ముందుగా ట్రంప్ దీపావళి సాంప్రదాయక ప్రమిద దీపం వెలిగించారు. భారతీయులు, ఇండో అమెరికన్లకు ఈ దివ్వెల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి ఉత్సవానికి ముందే తాను ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. చాలా మంచి సంభాషణ జరిగింది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్య విషయాలు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. ఇతర చాలా విషయాలు ముందుకు వచ్చాయి కానీ ట్రేడ్ విషయం కీలకం కదా అన్నారు. ఈ విషయంలో మోడీకి కూడా ఆసక్తి ఉందన్నారు. మోడీ గొప్ప వ్యక్తి, ఆయనతో తనకు ఏండ్ల తరబడి ఆయన తనకు మంచి మిత్రుడని వెల్లడించారు. ప్రదాని మోడీతో భారత్ పాక్ సంబంధాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు.
ఇరుదేశాల మధ్య ఘర్షణలు వద్దని చెప్పానని, ఇదే తనకు కావల్సిందన్నారు. అసలు వివాదం గురించి మీడియాకు తెలిసిందేనని, అయినా రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు కొనుగోళ్లకు ఇకపై దిగకపోవచ్చునని మీడియాకు చెప్పారు. భారత్ అమెరికా మధ్య రాబోయే రోజులలో మరిన్ని మంచి ఒప్పందాలు కుదురుతాయని కూడా ట్రంప్ వెల్లడించారు. తన మాదిరిగానే మోడీ కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారని, ఇది స్నేహభావ శాంతి సారూప్యం అని విశ్లేషించారు.
అమెరికా నిర్మాణంలో భారతీయ సమాజం కీలకం
అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఇక్కడి భారతీయ వ్యాపార వాణిజ్య వర్గాలు చిరకాలంగా కీలక పాత్ర వహిస్తున్నారని ట్రంప్ కొనియాడారు. వారి ఇక్కడి కంపెనీలను చూస్తే వారి కీలక పాత్ర ఏమిటనేది తెలుస్తుంది. పైగా ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా నిలిచాయని కొనియాడారు. దీపావళి వేడుకలకు వైట్‌హౌస్‌కు ఆహ్వానితులుగా తరలివచ్చిన వారిలో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్‌లతో వైట్‌హౌస్ కళకళలాడింది. అడోబ్ సిఇఒ శంతనూ నారాయణ్, మైక్రాన్ కార్యనిర్వాహకులు సంజయ్ మెహ్రోత్రా, ఐబిఎం సిఇఒ అరవింద్ కృష్ణ వంటి పలువురు వైట్‌హౌస్ వేడుకకు తరలివచ్చారు.
దివ్వె విశ్వాసానికి, చీకటిపై వెలుగు విజయానికి తార్కాణంగా నిలుస్తుంది. అజ్ఞానంపై జ్ఞానం గెలుపు ప్రతీక అని ముందుగా ట్రంప్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి తరలివచ్చిన తొలితరం బారతీయులలో తానూ ఒకడిని అని చెప్పారు. తన తల్లిదండ్రులు ఇక్కడికి చట్టబద్ధంగా వచ్చి స్థిరపడ్డారని వివరించారు. కార్యక్రమానికి అమెరికాలోని బారతీయ రాయబారి వినయ్ మెహన్ క్వాత్రా ప్రత్యేకంగా వచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ను వైట్‌హౌస్ వేడుక నడుమ కలుసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు స్పందించారు.