ఇక్కడి ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. అత్యంత పటిష్ట భద్రతతో ఉండే ఈ మ్యూజియంలో జరిగిన చోరీలో దాదాపు రూ 895 కోట్ల విలువైన నగలు వజ్రాలు దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లారు. తనిఖీల క్రమంలో ఈ చోరీ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు అత్యంత తెలివిగా , ఎవరికి అంతుచిక్కకుండా తమ పనులు సాగించే పింక్ ప్యాంథర్స్ గ్యాంగ్ వారే అయి ఉండవచ్చునని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. అత్యంత నైపుణ్యశిక్షణ కల వారిని ఎంచుకుని ఈ గ్యాంగ్‌లో చేర్చుకుంటారు. వీరు మాములు యాత్రికులుగానే మ్యూజియంలు ఇతర చోట్లలోకి ప్రవేశించి విలువైన నగలు ఎత్తుకుని వెళ్లుతారు. వేగంగా సరిహద్దులు దాటుతారు. తాము దొంగిలించిన నగలను కరిగించి వేరే రూపంలో భారీ ధరకు విక్రయిస్తుంటారు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్ 35 దేశాలలో 500 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లింది. వీరు పట్టుబడటం చాలా అరుదు అయింది. పారిస్ చోరీ ఘటనపై అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. దుండగులను పట్టుకునేందుకు గాలింపు తీవ్రతరం చేశారు. ఒకటి రెండు అరెస్టులు జరిగినట్లు అనధికారికంగా నిర్థారణ అయింది.