ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి విరుచుకుపడ్డారు. సైనిక బలంతో వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. జైల్లో తనతోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్‌పై మాజీ ప్రధాని నిప్పులు చెరిగారు.
“చట్టం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య పునాదులను బలహీన పరుస్తున్నారని విమర్వించారు.“ జైల్లో నన్ను పూర్తిగా ఒంటరిగా ఉంచారు. ఇలా రాజకీయ బాధితులను చేయడం పాక్ చరిత్రలో ఎప్పుడూ లేదు. జైలు నిబంధనల ప్రకారం కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కుమారులతోనూ కొన్ని నిమిషాలే మాట్లాడనిస్తున్నారు. రాజకీయ సహచరులతోనూ భేటీ కానివ్వడం లేదు. ప్రస్తుత పాలకుల తీరుతో సరిహద్దులో పరిస్థితులు దిగజారుతున్నాయి. అఫ్గాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి ” అని ఇమ్రాన్ వాపోయారు.
మరోవైపు ఇమ్రాన్ సన్నిహితుడు జుల్ఫీ బొఖారీ స్పందిస్తూ జైలు అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుష్రా బీబీని ఆరు గంటలకు పైగా జైలు బయట వేచి ఉండేలా చేశారని, ఇమ్రాన్‌తో భేటీ కాకుండా చూస్తున్నారని విమర్శించారు.