పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియాలో ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి చేసి, ఆత్యాచారం చేస్తామని బెదిరించారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.కోల్ కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్య జరిగినన ఏడాది తర్వాత ఈ సంఘటన జరగడంతో అధికార తృమమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పరస్పర విమర్శలకు ఆజ్యం పోసింది.హౌరా జిల్లాలోని ఉలుబేరియాలోని శరత్ చంద్ర చటోపాధ్యాయ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రిలో సోమవారం నాడు ఈ సంఘనట జరిగింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగి బంధువులే నిందితులు. వారు సోమవారం మధ్యాహ్నం వైద్యురాలితో ఘర్షణ పడి ఆమెపై దాడి చేశారని ఆరోపించారు. ఆ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో షేక్ హసిబుల్ అనే వ్యక్తి హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు.అతడితో పాటు షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్ అనే వారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తెలియడంతోనే బెంగాల్ లోని వైద్యులకు చెందిన జాయింట్ ఫోరం ఆఫ్ డాక్టర్స్ ఉలుబేరియా ఆస్పత్రిని సందర్శించింది.
విధినిర్వహణలో ఉన్న డాక్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.రాష్ట్రంలో మహిళలు, మహిళా డాక్టర్ల భద్రత విషయంలో నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ దుమ్మెత్తి పోసింది. ఆర్ జి కర్ ఆస్పత్రి ఘటన నుంచి మమత సర్కార్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య విమర్శించారు. తృణమూల్ ఒక దారుణ సమాజాన్ని సృష్టించిందని, ఇక్కడ హోమ్ గార్డ్ లు, పౌర వలంటీర్లు పార్టీలో భాగం అయ్యారని, వారికి పోలీసులు అన్నా లెక్కలేదని ఆయన అన్నారు. ఆస్పత్రులలో డాక్టర్లపై దాడులు అరికట్టే ఏర్పాట్లు లేవని, సిసిటివి కెమెరాలే లేవని ఆయన విమర్శించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఉలుబేరియా సంఘటన ను తృణమూల్ ప్రతినిధి అరుణ్ చక్రవర్తి ఖండించారు. ఇది దురదృష్టకరమైనదని అన్నారు. నిందితులు అందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.