మన తెలంగాణ/విద్యానగర్: బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టపరంగానే ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఇచ్చే కోటాతో బడుగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రికి ఆయన ఒక లేఖ రాశారు. గురువారం జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన స్పష్టత ఇవ్వాలని కోరారు.
పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని చెప్పిన ఆయన ఈ తరహా వాటాతో బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. ఎవరి భిక్షం వద్దని, చట్టబద్ధంగానే బిసిల జనాభా ఎంతో అంతా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశం కోర్టులో పరిధిలో ఉందని, మరో రెండు నెలల్లో తీర్పు రానుండగా తొందరపాటు నిర్ణయాలు ఎందుకని ప్రశ్నించారు. బిసి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జరిగిన రాష్ట్ర బంద్ చారిత్రాత్మకమని, అన్ని పార్టీలు, అన్నివర్గాలు బంద్‌కు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.
బిసిల డిమాండ్ న్యాయమైనదని, బంద్ తీవ్రతను పాలకులు గుర్తించాలన్నారు. స్థానిక సంస్థలలో బిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత, న్యాయబద్ధత ఉందని అన్నారు. ఆర్టికల్ 243- డి-6 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో చట్టం చేసినందున, వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలని సూచించారు. గతంలోనూ సుప్రీంకోర్టు అనేక తీర్పులలో జనాభా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచవచ్చని చెప్పినందున 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్ల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.