ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (78) జట్టును ఆదుకుంది. కాప్సె (38), చార్లి డీన్ (26) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను సదర్లాండ్, అష్లే గార్డ్‌నర్ ఆదుకున్నారు. చెలరేగి ఆడిన గార్డ్‌నర్ 73 బంతుల్లోనే 16 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేసింది. సదర్లాండ్ 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది.