మంగళహాట్: హైదరాబాద్ లోని రెండు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మంగళ హాట్, బహదూర్ పుర లో అగ్ని ప్రమాదం జరిగింది. బహదూర్ పురలో ఓ తుక్కు గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. బాణసంచా కారణంగానే గోదాంలో మంటలు చెలరేగాయని స్థానికులు వెల్లడించారు. మంగళహాట్ లోని పతంగులు తయారు చేసే గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున పతంగులు ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదాలలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా జరిగిందని అగిమాపక సిబ్బంది తెలిపారు. దీపావళి వేడుకలలో బాణసంచా పేలడంతోనే రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయని గోదాముల యాజమానులు వాపోతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.