నిజామాబాద్: బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రియాజ్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు సమక్షంలో కుటుంబ సభ్యులు రియాజ్ అంత్యక్రియలు జరిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం పోలీసులు రియాజ్ ను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్త జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరపడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు.