ఇటీవలే ‘ఒజి’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు దర్శకుడు సుజీత్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నెల 23 నుంచి ‘ఒజి’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ‘ఒజి’ చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే నాని హీరోగా సుజీత్ ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ‘ఒజి’ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే దాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కానీ, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్య, సుజీత్‌ల మధ్య దూరం ఏర్పడిందని వార్తలొచ్చాయి.
అయితే ఈ వార్తలకు సుజీత్ చెక్ పెట్టాడు. అతడు మంగళవారం పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఒజి’ విషయంలో తనను నమ్మి ఎంతగానో సపోర్ట్ చేశారంటూ నిర్మాత దానయ్యకు సుజీత్ కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా విషయంలో చాలామంది ఏదేదో మాట్లాకున్నారని.. కానీ, సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారని.. తన నిర్మాత, టీమ్ గురించి మాటల్లో చెప్పలేనని సుజీత్ పోస్ట్ పెట్టాడు. దీంతో నిర్మాత దానయ్యతో తనకు విబేధాలు లేవని సుజీత్ తేల్చి చెప్పాడు.