హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారంతో ముగుస్తుంది. ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామనేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు సహా స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 127 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట ఎంఆర్‌ఒ కార్యాలయంలో దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీపక్ రెడ్డి తరపున ఇప్పటికే ఆయన భార్య ఒకసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం హైలంకాలనీలో అమ్మవారి దేవాలయంలో దీపక్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైలంకాలనీ నుంచి యూసుఫ్‌గూడ బస్తీ వరకు బిజెపి ర్యాలీ చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బిజెపి ఎంపిలు, ఎంఎల్‌ఎలు పాల్గొననున్నారు. ఈ నామినేషన్లను అక్టోబర్ 22న ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ 24కాగా నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.