హైదరాబాద్: దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన వారిని దారుణంగా కొట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇసుక లారీని ఆపినందుకు లారీ కింద పడేసి చంపారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కరీంనగర్ జిల్లా వాసిని అని తాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం లేదని, గత ప్రభుత్వం మీద నాడు అవహేళన చేసి మాట్లాడుతుంటే తాము ఏం చేయలేని పరిస్థితి అని తెలియజేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యెం అని అహంతో మాట్లాడతారా? అని అడ్లూరి ప్రశ్నించారు. బేడీలు వేసి రైతులను తీసుకెళ్లిందెవరో అందరికీ తెలుసు అని అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ మీరు.. అని తమర్ని అనే హక్కు మీకు లేదని విమర్శించారు. పదేళ్లు రాజ్యమేలి ప్రజలకు ఏం చేశారో గుండెపై చేయి వేసుకొని చెప్పండని, విలాసవంతమైన జీవితాలు ఎలా గడుపుతున్నారో బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ మంత్రులపైనే నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్ చేసిన చరిత్ర మీది అని, తాము అధికారం లోకి రాగానే హామీలన్ని నెరవేరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకానికి బిల్లు లేకుండా చేశామని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని లూఠీ చేసి అస్తవ్యస్తం చేశారని, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులో పేరు కూడా జత చేయని దుస్థితి గత ప్రభుత్వానిదని, పేదవాళ్లకు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. సారు, కారు, పదహారు అన్నారని ఏమై పోయిందో చూశారు కదా? అని పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా బిజెపిని సమర్థించింది మీరు కాదా? అని నిలదీశారు. మీరంతా ఒక్కటై తిరిగి మాపై కాంగ్రెస్, బిజెపి ఒక్కటని అసత్య ప్రచారాలు చేస్తారా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయానికి తానొస్తానని ప్రమాణం చేసి మాట్లాడతారా? అని, పదే పదే దుష్ప్రచారాలు చేస్తే ప్రజలే మరోసారి మీకు బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దండుపాళ్యెం వ్యాఖ్యలపై హరీశ్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ సూచించారు.