తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం దీపావళి పండగ సందర్భంగా వెంకన్న దర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం కూడా భక్తులు భారీగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారిని 84,017 మంది భక్తులు దర్శించుకోగా 30,097 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, హుండీ ఆదాయం రూ.4.97 కోట్లుగా అధికారులు వెల్లడించారు.