తెలంగాణలో బిసి రిజర్వేషన్ అంశం రాజకీయ, చట్టపరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బిసి డిక్లరేషన్’ ద్వారా స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపితే అది అటునుంచి రాష్ట్రపతికి చేరింది. నెలలు గడుస్తున్నా ఆమోదం పొందకపోవడం, హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించమని ఆదేశించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ జిఒ నెం. 9 జారీ చేసింది. గ్రామ, వార్డుస్థాయి ఎన్నికల్లో 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఉద్దేశించింది. ఇది రాజ్యంగ విరుద్ధంగా తీసుకురాబడిందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ తరపున వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ జిఒపై మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ బ్రేక్ పడింది. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసినట్టు అయింది.
రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో ఈ స్టే చర్చనీయాంశమైంది. చాలామంది ఈ స్టేను ముందుగానే ఊహించారు. కొందరు నాయకులు స్థానిక అభ్యర్థుల్ని ‘ఎన్నికల ముందు ఖర్చులు పెట్టకండి’ అని హెచ్చరించారు. ఈ అంశం కేవలం స్టేకి మాత్రమే పరిమితం కాదు. ఇది భారత రిజర్వేషన్ విధానం, రాజ్యాంగ సవాళ్లు, రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా, రిజర్వేషన్‌కు ‘ట్రిపుల్ టెస్ట్’ సామాజిక, విద్యా వెనుకబాటుతనం, సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, రిజర్వేషన్లు యాభై శాతానికి లోబడి ఉండడం మొదలైన అంశాల్ని 1992 ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2024 తెలంగాణ కులగణన సర్వే డేటా ఈ టెస్ట్‌కు అవసరమైన ఎంపిరికల్ లోపాలను ఎత్తిచూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం చేసిన 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.63 కోట్లు. కానీ 2024 కులగణనలో మొత్తం జనాభా 3.70 కోట్లుగా నమోదైంది. 2011 నుండి 2014 మధ్య మూడేళ్లలో 13 లక్షలు (సగటున ఏడాదికి 4.33 లక్షలు) జనాభా పెరిగింది.
బిసిల్లో దాదాపు 120 కులాలు ఉండగా, కేవలం నాలుగైదు కులాలు మాత్రమే రిజర్వేషన్ ద్వారా లబ్ధ్ది పొందుతున్నాయన్న ఆరోపణలు బిసి సమాజం నుండే వ్యక్తం అవుతున్నాయి. మేమెంతో మాకంత నినాదం సరైందే. కానీ, అన్నివర్గాల్లో ఒక శాతం కూడా లేని కులాలు రాష్ట్రంలో వందకు పైగా ఉన్నాయి. మరి వారికెలా రిజర్వేషన్ కేటాయిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంపు ప్రయత్నాలు జరిగినపుడు కోర్టుల్లో న్యాయ సమీక్షకు గురైన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇక్కడే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 1993లో జయలలిత ప్రభుత్వం తమిళనాడు బిసి, ఎస్‌సి, ఎస్‌టి (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్) బిల్ -1993 తీసుకొచ్చి 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎఐఎడిఎంకె అలయన్స్ విజయం, పివి నరసింహారావు ప్రభుత్వం మెజారిటీకి ఎఐఎడిఎంకె మద్దతు అవసరం ఉండటంతో, 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని 1994లో 9వ షెడ్యూల్‌లో చేర్చారు.
భూసంస్కరణల కోసం తీసుకురాబడిన ఈ షెడ్యూల్ న్యాయ సమీక్ష నుండి రక్షణ ఇస్తుంది. 2007 ఐఆర్ కోయల్హో కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలు కూడా రాజ్యంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా లేకుంటే న్యాయ సమీక్షకు అతీతం కావని తెలిపింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాము మతపరమైన రిజర్వేషన్‌కు వ్యతిరేకమని, ముస్లింలను బిసిల్లో చేర్చితే బిల్లుకు మద్దతు ఇవ్వమని బిజెపి బాహాటంగానే చెప్తుంది. రిజర్వేషన్ పెంపు జరిగితే మా వల్లనే జరిగిందని ప్రచారం చేసుకునే రాజకీయ పార్టీలు కనబడుతున్నాయి తప్ప రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బిసి రిజర్వేషన్లు కల్పించాలని స్పృహలేకపోవడం శోచనీయం. కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ఎవరికీ లేదు. రాజ్యంగబద్ధ్దంగా రిజర్వేషన్లు అమలు చెస్తే ఎంతమంది కోర్టుకు వెళ్లినా కోర్టులు కూడా న్యాయం పక్షానే నిలుస్తాయి.
తమిళనాడు మోడల్ తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ పాత జిఒలు, రీనోటిఫికేషన్‌తో ముందుకు వెళ్తుందా? లేదా సుప్రీంలో పోరాటం చేస్తుందా లేదా తమవంతు ప్రయత్నం తాము చేశామని ప్రజల్లోకి వెళ్లి, పార్టీపరంగా 42% సీట్లను బిసిలకు కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం 2026లో జనగణనతోపాటు కులగణన ప్రారంభిస్తుంది. దాని డేటా రిజర్వేషన్‌లపై ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. తెలంగాణ కులగణన సర్వేలోపాలు, బిసిల్లో ముస్లిం, మైనార్టీలను కలపడం, బిసి ఉపవర్గీకరణ లేకపోవడం మొదలైనవి ట్రిపుల్ టెస్ట్‌కు సవాళ్లు. కోట్లాది మంది ఓటర్లు ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే, గ్రామీణ అభివృద్ధి, సెంట్రల్ గ్రాంట్లు కూడా ప్రభావితమవుతాయి. బిసిలకు సమతుల్య ప్రాతినిధ్యం లేకపోతే, సామాజిక అసమానతలు పెరుగుతాయి. రాజకీయ పార్టీలు మేమే బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేవారమని చెప్పుకోవడం కంటే బలమైన ఎంపిరికల్ డేటా, ఉపవర్గీకరణతో రాజ్యాంగ, చట్టపరమైన మార్గాలు ఎంచుకోవాలి.
– యం. అర్జున్