మన తెలంగాణ/హైదరాబాద్‌ః మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వారు, మద్దతు ఇస్తున్న వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హితవు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనతో పాటు అవినీతి, నేర, ఉగ్రవాద సంబంధాల నెట్ వర్క్‌ను వెలికి తీసి బయటపెట్టడానికి చర్యలు చేపట్టిన్నట్లు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మావోలకు మద్దతునిస్తున్న వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో గుట్టు బయటపడుతుందని ఆయన హెచ్చరించారు.
దేశ భద్రతకు ముప్పు కలిగించే వారు ఎవరైనా తప్పించుకోలేరని.. భద్రత విషయంలో కరుణ చూపకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత భద్రత విషయంలోనూ ముప్పు కలిగించే వారిని క్షమించేది లేదని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసే వారి వైపు నిలబడే వారు ఎవరైనా రాజీ లేదని తెలిపారు. రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతూ మావోలకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఇదే తమ హెచ్చరిక అని ఆయన తెలిపారు.