మన తెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులకు ఆబ్కారీ శాఖ తీపి కబురు చెప్పింది. నూతన దుఖాణాలకు మద్యం దరఖాస్తుల గడవు ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిసి బంద్, బ్యాంకులు బంద్‌లతో మద్యం షాపులకు దరఖాస్తులు వేసే ఔత్సాహికులు రాలేకపోయామని, ఈ క్రమంలో దరఖాస్తుల గడువు పెంచాలని చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఈ నెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, ఈ నేపథ్యంలో 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రా ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత ఈనెల 27వ తేదీన కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రాలు తీయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 85,363 దరఖాస్తులు వచ్చాయని, శనివారం ఒక్కరోజే 38,754 వచ్చినట్లు వెల్లడించారు.