నేడు ఇంగ్లండ్‌తో తలపడనున్న హర్మన్‌సేన
గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం
మహిళల వన్డే వరల్డ్ కప్
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళ జట్టు పరిస్థితి చావోరేవో అన్నట్టుగా ఉంది. టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో ఓటమిపాలైంది. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో వరుసగా ఓటమిపాలైన హర్మన్‌సేన సెమీస్ రేసు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 4 పాయింట్లు మాత్రమే కలిగిఉంది. దీంతో సేమీస్ చేరాలంటే సవాల్‌గా మారింది. రాబోయే మ్యాచ్‌లు బలమైన జట్లతో ఉండటంతో మరింత కష్టతరంగా మారింది. హర్మన్ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని తప్పకుండా గెలవాలి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ తర్వాత 23న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలోనూ ఓడిపోతే భారత్ ప్రపంచ కప్ కలలు ఆవిరైనట్టే. ఇది సాధ్యపడకుంటే కనీసం ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సిందే.
చివరి పోరు బంగ్లాతో..
న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి న్యూజిలాండ్‌ను ఓడించడం వల్ల భారత్‌కు రెండు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సెమీస్ రేసులో న్యూజిలాండ్‌కు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. నెట్ రన్ రేట్ మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఇక భారత్ చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బంగ్లాదేశ్‌నూ తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో విజయం కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. అలా కాకుంటే.. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిస్తే, సెమీఫైనల్ రేసు నుంచి పూర్తిగా వైదొలగకపోయినా, పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడు టీమిండియా ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు, వారి నెట్ రన్ రేట్ వంటి సంక్లిష్టమైన సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి, సెమీఫైనల్ బెర్త్‌ను సులభంగా ఖాయం చేసుకోవాలంటే, భారత్ తప్పనిసరిగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవడమే సురక్షితం.