మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌తో శనివారం బిసి సంఘాలు ఇచ్చిన బం ద్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘా లు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. బంద్ సందర్భంగా ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొన్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు వారు ఆశ్రయించడంతో ఇదే అదనుగా వారు అందినకాడికి దోచుకున్నారు. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది.
అండగా నిలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ
బిసి సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతానికి కృషి చేశారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్, ఇమ్లీబన్, ట్యాంక్‌బండ్ అంబెడ్కర్ విగ్రహాల వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండ సురేఖ, ఎంపి అనిల్ యాదవ్ తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. కాగా, మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు బంద్ లో పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ లిబర్టీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి , సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం,తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై బిసి, బిసిల ఐక్యత వర్ధిల్లాలి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్‌లో భాగంగా బిసి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి డిపోల ఎదుట బైఠాయించి, నిరసనలకు దిగారు.
దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, టిజెఎస్,, సిపిఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ, మాలమహానాడు, ఆదివాసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, జాగృతి, గిరిజన, మైనార్టీ, విదార్థు లు, ప్రజాసంఘాలు బంద్‌లో పొల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులకు వెళ్లాల్సిన ప్రయాణికులు పలు ఇక్కట్ల నెదుర్కొన్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిని ఎక్కడికక్కడ బిసి సంఘాల నాయకులు అడ్డుకున్నా రు.ఆయా ఆర్‌టిసి డిపోల ముందు ఆందోళనకు దిగారు. గేట్ మీటింగులు నిర్వహించి, అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శిం చారు.జిల్లాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్తాండ్‌లైన ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి.
ఆర్‌టిసి ప్రయాణీకుల అగచాట్లు
జూబ్లీ బస్‌స్టేషన్ ఎదుట బిజెపి కార్యకర్తలతో కలిసి మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ప్రధాన బస్టాండ్ ఎంజిబిఎస్ లోనూ ప్రయాణికులు బస్సులు లేక పడిగాపులు కాశారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు నెదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ బోసి పోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కదలట్లేదు. మరోవైపు ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్‌టిసి బస్సుల కోసమే పలువురు ప్రయాణికులు బస్టాండ ్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. ఎప్పటికీ బస్సులు రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇక, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరం గల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా బిసి రిజర్వేషన్లు పోరు కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన బంద్ లో బిసి సంఘాలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఆర్‌టిసి సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బిసి సంఘాలు, పలు పార్టీల నేతలు నిరసనలు చేపట్టారు.
ఆదిలాబాద్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆర్‌టిసి బస్సులు బయటకు రాకుండా బిసి సంఘాలు అడ్డుకున్నాయి. హనుమ కొండలో పలు దుకాణ సముదాయాలు స్వచ్ఛందం గా మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోని అన్ని డిపోల ముందు 5 గంటల నుంచి జెఎసి నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ ఇప్పటికే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలూ సైతం బంద్ పాటించాయి. బంద్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. మహబూబ్‌నగర్ ఆర్‌టిసి డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధర్నాకు దిగారు. రాజ్యాంగ సవ రణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీఓలు చెల్లవని తెలిపారు. ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.