ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు ముఖ్యంగా పాలమూరు పట్టణంలో గంజాయి కోరులు చాస్తూ బుసలు కొడుతోంది. రోజురోజుకు గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. ఇప్పటి దాక హైదరాబాద్ నగరాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఇప్పుడు పాలమూరుపై కన్నేశాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలు గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే గంజాయి మత్తు ఎలా గమ్మత్తుగా యువతను పెడదారిలోకి నెడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. గంజాయిని అరికట్టాల్సిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయం లేక పోవడం, ఉదాసీనంగా ఉండడంతో గంజాయి బ్యాచ్‌లు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నా, ఇక్కడ ఆయన ఆదేశాలు అమలు కావడం లేదనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ది ఉమ్మడి పాలమూరు జిల్లానే కావడం గమనార్హం. ఇద్దరు పెద్దలు ఉన్న జిల్లాలో గంజాయి మూడుపువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం దర్జాగా సాగుతుందంటే పరిస్ధితులు ఇక్కడ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీంలు గట్టి నిఘా వేయడంలో విఫలం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా కేంద్రంలో తిష్ట వేసిన ముఠాలు
ముఖ్యంగా జిల్లా కేంద్రంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులు, నిఘా నేత్రాల కళ్లుగప్పి ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లార్లు ఈ దందా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వన్‌టౌన్, బండ్లగేరి, మినీ ట్యాంక్ బండ్, మోటార్ లైన్, వీరన్నపేట, రైల్వేస్టేషన్ రోడ్, ప్రేమ్‌నగర్, మర్లు, రూరల్ ప్రాంతాల్లోనూ విక్రయాలు రహస్యంగా జరుగుతున్నాయి. ఆరు గ్రాముల గంజాయి ప్యాకెట్ ధర రూ. 400 నుంచి రూ. 500 దాక విక్రయిస్తున్నారు. వీటి విక్రయాలు వెనుక హైదరాబాద్ ముఠాల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముఠా ఇక్కడి కొన్ని ముఠాలతో చేతులు కలిపి ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోకి గద్వాల జిల్లా మీదుగా కర్నాటక, నారాయణపేట మీదుగా మహారాష్ట్ర నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, నల్లమల్ల నుంచి నాగర్‌కర్నూలు జిల్లాలకు సరఫరా అవుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలు కూడా ఇప్పుడు గంజాయి మత్తులో జోలపాటగా మారింది.
మాట్లాడితే దాడులే: గంజాయికి అలవాటు పడిన యువత మత్తులో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ప్రధానంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యన ఉన్న యువతనే ఈ గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా పేద కాలనీల్లోని పేద యువతనే దీని మత్తుకు చిత్తు అవుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ చేసి దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయిచరణ్ గత నెల 16వ తేది వన్‌టౌన్ నుంచి బండ్లగేరి మీదుగా రాత్రి వెళ్తున్న సమయంలో బండ్లగేరి దగ్గర ఉన్న 7 మంది అడ్డగించారు. అప్పటికే గంజాయి సేవించిన ఆ బ్యాచ్ లో ఉన్న కొందరు సాయిచరణ్‌ను డబ్బులు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో కడుపులో గుద్ది తీవ్ర గాయాలకు గురిచేశారు. ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడికి కుడివైపున ఒక అవయవం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక కాలనీలో కొందరు యువత రాత్రి సమయంలో ఇళ్లపై దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మినీ ట్యాంక్ బండ్, పట్టణ సమీపంలో బైపాస్, రియల్ ఎస్టేట్ వెంచర్లలలో ఈ దందా జరగడమే కాకుండా గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలువాటుపడిన యువత ఇంకా ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే ప్రమాదాలు లేక పోలేదు.
మచ్చుకు కొన్ని సంఘటనలు: ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో బాలనగర్ మండల పరిధిలోని గుండేడు నుంచి గుడిత్యాల వెళ్లేదారిలో ఉన్న కిరాణ షాపులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురుపై దాడులు చేసి లక్ష విలువ చేసే 1.2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రయాలు జరుపుతున్న కిషన్, నేనావత్ కృష్ణ, అతని భార్య లాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ పరిధిలోని మయారి పార్క్ దగ్గర గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఇటీవల నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, రూ. 5 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఊట్కూర్ మండల పరిధిలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గద్వాల జిల్లాలో మహరాష్ట్ర నుంచి గద్వాలకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లాలో ఏకంగా 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్లలో 6 నెలల వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఏడాదిలో 22 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కేవలం గంజాయి పట్టుబడ్డవి మాత్రమే. అయితే పట్టుబడకుండా రహస్యంగా ఈ గంజాయి అమ్ముతున్న చీకటి దందా పెద్దగానే జరుగుతున్నట్లు సమాచారం.
చట్టం ఏమి చెబుతోంది?: గంజాయి, డ్రగ్స్ విక్రయించినా, తాగినా చట్టం ప్రకారం శిక్షార్హులే. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) 1985 ప్రకారం పది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ కేసు కింద పోలీసులు నమోదు చేస్తే తాను నేరం చేయలేదని నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. కొందరు తెలిసో తెలియకనో ఈ గంజాయి వలలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పట్టుబడితే ఇక జైలు జీవితం గడపాల్సిందే. ఇక గంజాయి, డ్రగ్స్ సేవించే వారికి కూడా చట్టంలో కఠినంగా ఉన్నాయి. గంజాయి సేవిస్తే రక్తనమూనాలో ఆ ఆనవాళ్లు 48 గంటల పాటు ఉంటుంది. గంజాయి తాగినట్లు పోలీసుల వద్ద ఉన్న కిట్లలో నమోదైతే కేసులు నమోదు చేస్తారు. బెయిల్ అంత త్వరగా రావడం కష్టమే. ఇక నేరం రుజువైతే ఏడాది జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.
– బిజి. రామాంజనేయులు
90598 95411
(బ్యూరో ఇంచార్జీ
మహబూబ్‌నగర్)