తిరుమల: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత తన భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకోగానే టిటిడి అధికారులు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలోని హాథిరాం బావాజీ మఠం బార్సీ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన భోగ్ భండార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తిరుమలలో బంజారాల ఆరాధ్య దైవం అయిన హాథిరాం బావాజీ మఠంలో తమకు తగిన స్థానం కల్పించాలని దక్షిణ భారతదేశంలోని బంజారా సాధు సంత్ ల పక్షాన నిలబడి ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించానని ఆమె తెలిపారు.