మన తెలంగాణ/హైదరాబాద్: నిస్సహాయకుల కు సహాయం అందించడమే మన బాధ్యత అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవ డం మన బాధ్యత అని, అందుకు గ్రూప్2 విజేతలు అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతంలో 10నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానని హెచ్చరించారు. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతం ఎలా వస్తుందో.. అలాగే వారి తల్లిదండ్రుల అకౌంట్‌లో ఒకటో తేదీన పడుతుందని, దీని కోసం
త్వరలో చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.ఆ చట్టం మీతోనే రాపిస్తామని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అందుకోసం కొత్తగా అధికారులు అయిన ఉద్యోగులతో ఒక కమిటీని నియమించాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని గ్రూప్ 2 విజేతలకు సిఎం సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు శనివారం శిల్ప కళావేదికలో సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని… కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు, బందు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని ఆరోపించారు. అల్లుడిని అంబానీగా, కొడుకును అదానీగా చేయడం కోసమే గత పదేళ్లు పాలన జరిగిందని విమమర్శించారు. గత ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు, హోదాలను తన కుటుంబీకులకే ఇఛ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వెంటనే వారికి ఎంఎల్‌సిలు, ప్లానింగ్ కమిషన్‌లో పదవులు ఇచ్చిందని,కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని అన్నారు. తన కుటుంబం, బంధువుల ఉద్యోగాల గురించి ఆలోచించినట్లు యువత గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ మహిళల గురించి ఆలోచించలేదని ఆక్షేపించారు. కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గత పాలకకులు ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదు అని, రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయి ఉండేదని కాదని, మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆక్షేపించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవని..కానీ, వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నించారు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
నేను సిఎంగా ఉండకపోయినా.. మీరు అధికారులుగా ఉంటారు
గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు అని గ్రూప్ 2 విజేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని, మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని ఆక్షాంక్షించారు. రేపటి రోజున తాను ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. మీరు మాత్రం అధికారులుగానే ఉంటారని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్:నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. నాయకులం తాత్కాళికం.. అధికారులే శాత్వతం అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు ఏవీ ఆపకుండా కొనసాగించాలని కోరారు.
చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు ఆవేదన కలిగింది
తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తున్నట్లుగా ఒక పెద్దాయన చెప్పారని, మరి ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదవిన తాను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలే కారణం అని అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్- 1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారని, పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా..? అని ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించే విధంగా వారు మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు చాలా ఆవేదన కలిగిందని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ జరగని కులగణన కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని అన్నారు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోందని విమర్శించారు. వాళ్ల దోపిడీ గురించి తాము చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని అన్నారు. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఇవి నియామక పత్రాలు కావు..నిరుద్యోగుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు : భట్టి
తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు గ్రూప్-2 నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఇలాంటి నియామకాలు చేయలేకపోయారని,తాము చేయకుండా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. అయినా యువత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. తాము ఇస్తున్నవి కేవలం నియామక పత్రాలు కావు అని, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కార్పొరేట్ రంగాల్లో కూడా అవకాశాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.