జనవరి 21 నుంచి 30 వరకు తొలి విడత జెఇఇ మెయిన్
ఏప్రిల్‌లో 1 నుంచి 10 వరకు రెండో విడత
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2026 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో తొలి విడత జెఇఇ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది.జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది.
జెఇఇ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. సెషన్ -2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా పరీక్ష నిర్వహించే సిటీల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తున్నామని.. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంది.
డాక్యుమెంట్లు అప్‌డేట్ చేసుకోండి: ఎన్‌టిఎ సూచన
జెఇఇ మెయిన్ 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టిఎ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.
ఆధార్: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం) సరిగా ఉండేలా అప్‌డేట్ చేసుకోండి. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు మీ కార్డులో అప్‌డేట్ అయి ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులైతే యుడిఐడి కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్ చేయించుకొని అప్‌డేట్‌గా ఉండటం తప్పనిసరి. ఎస్‌సి, ఎస్‌టి,ఒబిసిఎన్‌సిఎల్, ఇడబ్లూఎస్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లుబాటయ్యేలా అప్‌డేట్ చేయించుకోవాలి.
జెఇఇ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్
జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 వరకు
దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ నెలలో ప్రారంభం
జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు
దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభం