మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చురకలంటించారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి.. బాంబులు పేలతాయన్నారని.. మళ్లీ దీపావళి కూడా వచ్చనా, బాంబులు పేలడం లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం బిఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకెళ్లామని, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామివేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా దందాలు చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. ప్రజా రవాణాను బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవలసిన ప్రభుత్వం, ప్రజలు ఉన్న ప్రాంతాలను పక్కనపెట్టి, భవిష్యత్తు లేని ఫ్యూచర్ సిటీ వైపు అడ్డగోలు సొమ్మును ఖర్చు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తమ భూములకు మరింత ధర వచ్చేలా ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.